అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోన్న బలగం హవా..
కథలో కంటెంట్ ఉండాలే కానీ బడ్జెట్, స్టారింగ్తో సంబంధం లేదని నిరూపించిన సినిమాల్లో బలగం ఒకటి. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కుటుంబాల మధ్య ఉండే భావోద్వేగాలను అత్యంత సహజంగా తెరకెక్కించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు దర్శకుడు వేణు. దర్శకుడిగా తొలి సినిమానే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించిందీ మూవీ. దీంతో బలగానికి అవార్డులు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న బలగానికి తాజాగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ – ఆమ్స్టర్డామ్ కార్యక్రమంలో అవార్డును అందుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని అందుకున్నారు. యూకే, యూఎస్, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన చిత్రాలు, దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడం విశేషం. తాజాగా వచ్చిన అవార్డుతో ‘బలగం’ ఖాతాలో ఏకంగా తొమ్మిది అవార్డులు చేరాయని దర్శకుడు వేణు పేర్కొన్నారు.