తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ, “సినీ పరిశ్రమను మెరుగైన దశకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు.
సినీ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు:
“హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కార్మికుల నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ కల్పిస్తాం. కార్మికులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి,” అని సీఎం సూచించారు. అలాగే, సమ్మెలు జరగడం వలన రెండు వైపులా నష్టం జరుగుతుందని హెచ్చరించారు. “పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టకండి. సమస్యలు ఉంటే చర్చించండి. సమ్మెలు ద్వారా సమస్య పరిష్కారం కాదు,” అని తెలిపారు.
హెల్త్ ఇన్సూరెన్స్, ప్రోత్సాహక పథకాలు:
సినీ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించే చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పురస్కారాల విషయంలో జాప్యం:
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు గత పదేళ్లుగా సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అవార్డులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సీఎం స్థాయిలో ఇలా సమావేశం నిర్వహించినది ఇదే మొదటిసారని రేవంత్‌ను ప్రశంసించారు.