బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ భారీ కుట్ర జరుగుతోందంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలనం రేకెత్తించారు. కల్వకుంట్ల కవితను ఏ విధంగానైతే కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు పంపించారో, అదే రీతిలో కేటీఆర్‌ను కూడా పక్కకు నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద వ్యక్తి ఉన్నారని, ఆయనకు బీజేపీ నేతలు మద్దతిస్తున్నారని బాంబు పేల్చారు.
గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న ఓ ట్రబుల్ షూటర్, కేటీఆర్‌ను పక్కకు తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బెంగళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో, కేటీఆర్‌ను ఇరికించాలనే ప్లాన్ మొదలైంది” అని ఆయన ఆరోపించారు.
గతంలో హైదరాబాద్‌లో సెలబ్రిటీల డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కేటీఆర్ పేరును ప్రస్తావించారని, దాన్నే ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఆయనపై కుట్ర పన్నుతున్నారని రామ్మోహన్ రెడ్డి వివరించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను గతంలో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని, వ్యాపార ఒప్పందాల కోసమే కేటీఆర్, నారా లోకేశ్ రహస్యంగా భేటీ అయ్యారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.