తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పదవిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
ఇంతకాలం మెట్రో రైల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన రిటైర్డ్ అధికారి ఎస్వీఎస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ఆయనను ప్రభుత్వానికి పట్టణ రవాణా సలహాదారు (అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ అడ్వైజర్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో ఆయనకున్న అనుభవాన్ని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు వినియోగించుకోనున్నారు.
మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం. రాజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్ నియమితులయ్యారు.