తెలంగాణలో మరో అవినీతి అధికారి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో టీజీఎస్పీడీసీఎల్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఏకంగా రూ. 2 కోట్లకు పైగా నగదును చూసి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులే ఆశ్చర్యపోయారు.
హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ డివిజన్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ)గా పనిచేస్తున్న అంబేద్కర్ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు సంపాదించారని ఏసీబీకి సమాచారం అందింది. దీంతో మంగళవారం ఉదయం ఆయనతో పాటు ఆయన బంధువులకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 2.18 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నగదుతో పాటు భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒక ఇల్లు, జీ+5 భవనం, రెండు ప్లాట్లు, 1000 గజాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ‘అమ్‌థార్ కెమికల్స్’ అనే రసాయన పరిశ్రమను కూడా గుర్తించారు. వీటితో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అంబేద్కర్ మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.