AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ. 10 కోట్లకు బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ ఎటువంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

 

తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ కేటీఆర్ తరఫు న్యాయవాదులు ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపారు. అయితే, ఆ నోటీసులకు బండి సంజయ్ స్పందించకపోవడంతో పాటు, క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ దావాలో కేటీఆర్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు గాను బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తన పరువుకు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు, ప్రచురణలు చేయకుండా బండి సంజయ్‌ను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, ఇప్పటికే ఆన్‌లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర వార్తా మాధ్యమాలలో ఉన్న పరువు నష్టపరిచే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10