AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంగరంగ వైభవంగా రఘునాయక స్వామి కళ్యాణం..

అకస్మాత్తుగా ప్రత్యక్షమై గరుడ పక్షి ప్రదక్షిణలు
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

రుడపక్షి ఆగమనం…
ఈ కళ్యాణ వేడకల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదే, స్వామివారి కళ్యాణం రోజున స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళ్లింది. భక్తులు గరుడపక్షిని చూసి భక్తితో మైమరచిపోయారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. కన్నులపండువగా నిర్వహించిన ఈ కళ్యాణవేడకుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ANN TOP 10