తెలంగాణలో వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో కళాశాలల బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. ఫలితంగా మంగళవారం (సెప్టెంబర్ 16) నుండి తరగతులు యథాతథంగా ప్రారంభం కానున్నాయి.
ఈ అంశంపై మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రైవేట్ వృత్తి విద్యా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం ప్రభుత్వం రూ.1200 కోట్ల బకాయిలను దీపావళి నాటికి విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం టోకెన్ల రూపంలో ఉన్న రూ.600 కోట్లను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..”విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశం. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వరంగా మారింది. గత ప్రభుత్వ పాలనలో నిధులు పెండింగ్‌లో పెట్టి భారంగా మార్చింది. ఇప్పుడు మేం దాన్ని సమర్థవంతంగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నాం,” అని చెప్పారు.
అలాగే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రేషనలైజ్ చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిశీలించిన యాజమాన్యాలు తరగతుల బంద్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వ విజ్ఞప్తిని గౌరవించి తరగతులు తిరిగి ప్రారంభించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు భట్టి ధన్యవాదాలు తెలిపారు.