AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీకి మరో బిగ్ షాక్..! బీజేపీలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించనున్నారు. ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు భాజపాతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.

 

పోతుల సునీత రాజకీయ ప్రస్థానంలో ఇది మూడో మలుపు. ఏడాది క్రితం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఇప్పుడు జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపారు.

 

గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో టీడీపీ తరఫున ఆమె తొలిసారిగా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2020 నవంబరులో ఆమె టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై సేవలందించారు.

 

టీడీపీ, వైసీపీ వంటి రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలలో పనిచేసిన అనుభవం ఉన్న పోతుల సునీత ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10