ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అవినీతి, అప్రజాస్వామిక విధానాలతో అంధకారంలోకి వెళ్లిపోయిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ చీకటి రోజులకు చరమగీతం పాడారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. మోదీ, చంద్రబాబుల సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని అన్నారు.
విశాఖపట్నంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “2014కు ముందు దేశంలో వారసత్వ, అవినీతి రాజకీయాలు రాజ్యమేలాయి. అదే తరహాలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైంది. రాష్ట్ర ప్రజలను గత పాలకులు దారుణంగా మోసం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీ మళ్లీ పునరుజ్జీవనం పొందుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందని నడ్డా గుర్తుచేశారు. దశాబ్దాల నాటి అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నడ్డా, రాష్ట్రానికి కేటాయించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. సాగర్ మాల పథకం కింద 14 పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో పది కేంద్ర విద్యాసంస్థలు, ఆరు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి రూ.625 కోట్ల నిధులు విడుదల చేశామని, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, అమృత్ భారత్, వందే భారత్ వంటి ఆధునిక రైల్వే సేవలతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో కలిసికట్టుగా పనిచేస్తామనే స్పష్టమైన సందేశాన్ని ఈ సభ ద్వారా నడ్డా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.