AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్ బైపోల్..! రంగంలోకి సీఎం రేవంత్..! కీలక సమావేశం..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, పార్టీ గెలుపు వ్యూహాలపై దృష్టి సారించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో నేడు కీలక సమావేశం నిర్వహించారు.

 

ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్‌ఛార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ చేర్చాలని, బూత్ స్థాయి నుంచి పటిష్టంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

 

“నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను ప్రజలకు కల్పించాలి. అభ్యర్థి ఎవరనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయిస్తుంది. కానీ, అభ్యర్థి ఎవరైనా పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా ఆయన సూచించారు.

 

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సమీక్ష నిర్వహించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

ANN TOP 10