AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక… అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర రైతుల నుంచి రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించి, 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

 

శుక్రవారం నాడు కాకినాడ కలెక్టరేట్‌లో 5 జిల్లాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, వీసీ ఎండీ డా. మనజీర్ జిలాని సమూన్ కూడా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత ఖరీఫ్, రబీ సీజన్లలో 7.67 లక్షల మంది రైతుల నుంచి రూ.12,557 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1,674 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించిందని తెలిపారు. ఈసారి పంటలు ముందుగా కోతకు వస్తున్నందున, అక్టోబర్ రెండో వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గోనె సంచులు, రవాణా వంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 50 లక్షల టన్నుల లక్ష్యంలో, కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే 19.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనున్నట్లు మనోహర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం సాధారణ రకం వరికి రూ.2,369, ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధర ప్రకటించిందని ఆయన తెలిపారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సన్న రకాల ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

 

సేకరణ ప్రక్రియలో పారదర్శకత కోసం ‘ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ ఖరీఫ్ నుంచి మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలను కూడా ఆన్‌లైన్‌లోనే సేకరిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 1,234 రైతు సేవా కేంద్రాలను, 691 రైస్ మిల్లులను అనుసంధానం చేసి సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తామని అధికారులు మంత్రికి వివరించారు.

ANN TOP 10