నేపాల్ లో క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న తమను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు ఆంధ్రప్రదేశ్ వాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చొరవతోనే తాము ఈ రోజు సొంత గడ్డపై అడుగుపెట్టగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించిందని వారు ప్రశంసించారు.
వివరాల్లోకి వెళ్తే, నేపాల్ రాజధాని ఖాట్మాండూలో చిక్కుకుపోయిన 144 మంది తెలుగువారి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి బయలుదేరి, మొదటగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతికి పయనమవుతుంది. ఈ విమానంలో మొత్తం 104 మంది విశాఖలో దిగనుండగా, మరో 40 మంది తిరుపతి విమానాశ్రయంలో దిగనున్నారు.
గత రెండు రోజులుగా ఈ వ్యవహారాన్ని మంత్రి నారా లోకేశ్ స్వయంగా పర్యవేక్షించారు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నేపాల్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు కూడా రవాణా సౌకర్యాలను కల్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల కష్టాలు తీరాయి.