AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రింట్ మీడియా హవా.. దేశంలో మళ్లీ పెరిగిన దినపత్రికల అమ్మకాలు..

డిజిటల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లోనూ దినపత్రికలు తమ ప్రాభవాన్ని కోల్పోలేదని మరోసారి రుజువైంది. దేశంలో వార్తాపత్రికల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, పాఠకుల నుంచి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్ (ఏబీసీ) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. విశ్వసనీయమైన, లోతైన సమాచారం కోసం ప్రజలు ఇప్పటికీ పత్రికలనే ఆశ్రయిస్తున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

 

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దినపత్రికల సర్కులేషన్‌పై ఏబీసీ ఆడిట్ నిర్వహించింది. ఈ ఆరు నెలల్లో మొత్తం 2,97,44,148 (రెండు కోట్ల తొంభై ఏడు లక్షల నలభై నాలుగు వేల నూట నలభై ఎనిమిది) కాపీలు అమ్ముడైనట్లు ఏబీసీ తన ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 2,89,41,876 కాపీలతో పోలిస్తే ఇది 2.77 శాతం అధికమని పేర్కొంది. అంటే, కేవలం ఏడాది వ్యవధిలోనే 8,02,272 అదనపు కాపీల అమ్మకాలు జరిగాయి.

 

ఈ వృద్ధికి ప్రధాన కారణం పత్రికలపై ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకమేనని ఏబీసీ అభిప్రాయపడింది. ధ్రువీకరించిన, నిఖార్సయిన వార్తల కోసం పాఠకులు దినపత్రికలనే ఎంచుకుంటున్నారని తెలిపింది. వార్తాపత్రికలు ఇప్పటికీ అత్యంత శక్తిమంతమైన ప్రసార మాధ్యమంగా కొనసాగుతున్నాయనడానికి ఈ సర్కులేషన్ పెరుగుదలే నిదర్శనమని ఏబీసీ విశ్లేషించింది. ఈ ఆరోగ్యకరమైన పురోగతి ప్రింట్ మీడియా పరిశ్రమకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోందని నిపుణులు అంటున్నారు.

ANN TOP 10