AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆటో డ్రైవర్‌లకు చంద్రబాబు గుడ్ న్యూస్..! దసరాకి భారీ కానుక..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించారు. దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా “వాహన మిత్ర” పథకాన్ని ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

 

అనంతపురంలో నిన్న జరిగిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఎన్నికల సమయంలో ఇచ్చిన స్త్రీ శక్తి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) హామీని అమలు చేసింది. ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో పట్టణ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిపోయింది. దీనితో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఈ కీలక ప్రకటన చేశారు.

 

ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, సంక్షేమం ఓట్ల కోసమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఉండాలని అన్నారు. ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలందిస్తున్న సామాజిక శ్రామికులని, వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలను వివరించారు.

 

స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని ఆయన తెలిపారు. తల్లికి వందనం పథకం కింద పిల్లల సంఖ్య మేరకు తల్లులకు రూ.15 వేల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 47 లక్షల మంది రైతులకు నేరుగా నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా పలువురు కేంద్ర మంత్రులు, మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

ANN TOP 10