గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పదిమంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా చెప్పారని, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడి ప్రకటనను తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు.
జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిపై చర్యలు తీసుకోవడానికి శాసనసభాపతి ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.