AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీఎస్‌టీ తగ్గింపు పై పుకార్లు వైరల్..! కేంద్రం స్పందన..!

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)కు సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక సందేశంపై కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ కింద కొన్ని కొత్త పరివర్తన ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేదని ఆదివారం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరూ నమ్మవద్దని వ్యాపార, వాణిజ్య వర్గాలకు, సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ధరలు తగ్గేందుకు వీలుగా, శ్లాబులను సవరించడం మాత్రమే జరిగిందని స్పష్టం చేసింది.

 

వైరల్ సందేశంలో ఏముంది?

 

సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఒక అనధికారిక సందేశం వ్యాపారుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైంది. సీబీఐసీ చైర్మన్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశంలో.. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీలో కీలక మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. దీని ప్రకారం, వినియోగించని సెస్ క్రెడిట్‌ను వాడుకోవడానికి అవకాశం కల్పిస్తారని, పన్ను మినహాయింపు ఉన్న సరఫరాలపై కూడా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలను అనుమతిస్తారని, అలాగే ధరల సర్దుబాటుకు సంబంధించి సరికొత్త నిబంధనలు తీసుకురానున్నారని ఆ సందేశం సారాంశం. ఈ మార్పులు వ్యాపారులకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయని కూడా అందులో పేర్కొనడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపారు.

 

సీబీఐసీ అధికారిక ప్రకటన

 

ఈ తప్పుడు ప్రచారం తమ దృష్టికి రావడంతో సీబీఐసీ వెంటనే రంగంలోకి దిగింది. “సీబీఐసీ చైర్మన్ పేరుతో జీఎస్‌టీ పరివర్తన ప్రయోజనాలపై ఒక అనధికారిక సందేశం సర్క్యులేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి వినియోగించని సెస్ క్రెడిట్, మినహాయింపు సరఫరాలపై ఐటీసీ, కొత్త ధరల సర్దుబాటు నిబంధనలు అమల్లోకి వస్తాయన్న వాదనలు వాస్తవ విరుద్ధం, పూర్తిగా తప్పుదోవ పట్టించేవి” అని తమ ప్రకటనలో స్పష్టం చేసింది. జీఎస్టీకి సంబంధించిన ఏ సమాచారానికైనా కేవలం ప్రభుత్వం జారీ చేసే అధికారిక నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ) వంటి వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు, వాణిజ్య, పరిశ్రమల వర్గాలకు సూచించింది.

 

ప్రస్తుతానికి ప్రభుత్వం అలాంటి సంస్కరణలను అమలు చేసే ఆలోచనలో లేదని సీబీఐసీ తేల్చిచెప్పింది. కాగా, ప్రభుత్వం ఇప్పటికే జీఎస్‌టీలో నెక్స్ట్-జనరేషన్ సంస్కరణలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పన్ను రేట్ల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించింది. గతంలో ఉన్న నాలుగు శ్లాబుల నిర్మాణాన్ని రెండుకు (5%, 18%) తగ్గించింది. 12%, 28% శ్లాబులను రద్దు చేసి, పొగాకు, సిగరెట్లు వంటి విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక రేటును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, అనధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని నమ్మి వ్యాపారులు అయోమయానికి గురికావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు

ANN TOP 10