ములుగు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్ ఆత్మహత్య ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో మనస్తాపానికి గురై ఓ కార్మికుడు ప్రాణాలు తీసుకోవడం ‘ప్రభుత్వ హత్య’ కిందకే వస్తుందని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
మహేశ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. “కనీసం నెల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు. ప్రభుత్వ వైఫల్యం వల్లే మహేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు” అని ఆయన అన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణమే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, మహేశ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, మహేశ్ మృతిని ప్రమాదంగా చిత్రీకరిస్తూ అధికార పార్టీ నేతలు ఓ వీడియోను ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అనుకుని పొరపాటున పురుగుల మందు తాగాడని చెప్పించడం, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న క్రూరమైన ప్రచారమని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆదివారం కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ నేత ఎరువ సతీశ్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి మాధవరావుపల్లిలోని మహేశ్ నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఫోన్‌లో మహేశ్ తల్లితో మాట్లాడి ఓదార్చారు. ఆరు నెలలుగా జీతం రాకపోవడంతో తన కొడుకు… భార్య, నలుగురు ఆడపిల్లలను పోషించలేక తీవ్రంగా మదనపడ్డాడని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో వైద్యానికి డబ్బుల్లేక ఓ బిడ్డను కూడా కోల్పోయామని, ఇప్పుడు బకాయిల కోసం అడిగి అవమానం భరించలేక, పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడని ఆమె వాపోయారు.
ఆమె మాటలకు చలించిపోయిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహేశ్ కుమార్తెలకు ఆర్థిక సహాయం అందిస్తామని, రెండు రోజుల్లో సతీశ్ రెడ్డి ద్వారా ఆ సహాయాన్ని చేరవేస్తామని హామీ ఇచ్చారు. జీతాలు రాకపోవడం వల్లే తన మామయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, కొందరు వ్యక్తులు బలవంతంగా ఆయనతో పొరపాటున తాగానని వీడియో రికార్డు చేయించారని మృతుడి మేనకోడలు జ్యోతి ఆరోపించడం గమనార్హం.