AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిగ్ బాస్ సీజన్-9 హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ వీళ్లే..!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ తొమ్మిదో సీజన్ ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈసారి ‘అగ్నిపరీక్ష’ అనే థీమ్‌తో పాటు, సెలబ్రిటీలతో సామాన్యులను పోటీకి దించి నిర్వాహకులు షోపై అంచనాలను భారీగా పెంచేశారు.

 

ఈ సీజన్‌లో మొత్తం 15 మంది పోటీదారులు టైటిల్ కోసం తలపడనున్నారు. వీరిలో 9 మంది సినీ, బుల్లితెర ప్రముఖులు ఉండగా, ఆరుగురు సామాన్యులు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రిటీల జాబితాలో తనూజ పుట్టస్వామి, ఇమానుయేల్, ఫ్లోరా సైనీ, శ్రేష్ఠి వర్మ, రీతూ చౌదరి, భరణి, సంజనా గల్రానీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు.

 

ఇక ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సామాన్యులను ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో ఎంపికైన కల్యాణ్ పడాల, హరిత హరీష్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ అనే ఆరుగురు సామాన్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. దీంతో ఈసారి ఆట మరింత రసవత్తరంగా మారనుంది.

 

గత సీజన్లకు భిన్నంగా ఈసారి ‘డబుల్ హౌస్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ఇది ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతుందని చెబుతున్నారు. స్టార్ మా ఛానెల్‌తో పాటు, జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ షో ప్రసారం కానుంది. షోను 24 గంటల పాటు వీక్షించాలనుకునే వారి కోసం జియో హాట్‌స్టార్‌లో రాత్రి 10:20 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సరికొత్త టాస్క్‌లు, నాటకీయ పరిణామాలతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.

ANN TOP 10