AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహా గణపతికి భక్తుల ఘన వీడ్కోలు.. మొదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..

నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొలువుదీరిన ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరారు. పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. వాస్తవానికి ఉదయం 6 గంటలకు యాత్ర మొదలుకావాల్సి ఉన్నా, కొద్దిపాటి ఆలస్యంగా గణనాథుడిని వాహనంపైకి చేర్చి ఊరేగింపును ప్రారంభించారు.

 

69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌కు తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన 26 టైర్ల ప్రత్యేక వాహనాన్ని వినియోగిస్తున్నారు. దాదాపు 100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. గణపతికి ఇరువైపులా ఉన్న పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగిస్తున్నారు.

 

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న నాలుగో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మొత్తం 20 క్రేన్లను అందుబాటులో ఉంచింది. వాటిలో ఒకటి భారీ బరువును మోయగల “బాహుబలి క్రేన్” కావడం విశేషం.

 

ఖైరతాబాద్ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.

ANN TOP 10