తెలంగాణ జాగృతి నాయకుడు రాజారాం యాదవ్ సంస్థ అధ్యక్షురాలు కవితపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వాన్ని వ్యతిరేకించే శక్తులకు ఆమె వ్యాఖ్యలు మద్దతుగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ఆమె ప్రలోభాలకు గురై మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని, ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని సూచించారు.
ఆమె మాట్లాడుతున్న మాటలను ఏ టీవీ ఛానల్స్, ఏ పత్రికలు చూపిస్తున్నాయో తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారికి ఆమె వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమకు తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నాయకత్వం ముఖ్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ ద్రోహులకు ఆయుధమిస్తున్నాయి: జాగృతి నేత ప్రశాంత్
కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థకు చెందిన మరో నేత ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కవిత మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ద్రోహులకు ఊతమిచ్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని ఆమె ఆలోచించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌పై విమర్శలు చేసేవారికి ఆమె వ్యాఖ్యలు ఆయుధంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు నిరంతరం తెలంగాణ అభివృద్ధి కోసం తపనతో పని చేస్తారని అన్నారు.