AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీఎస్టీ ప్రయోజనం బదిలీ చేయాలని కేంద్రమంత్రి కీలక సూచన..

ప్రభుత్వం పలు వస్తువులపై ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు. దీనివల్ల మార్కెట్‌లో వినియోగదారుల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

గురువారం ఢిల్లీలో జరిగిన ‘భారత్ న్యూట్రావర్స్ ఎక్స్ పో 2025’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా పరిశ్రమలకు అమ్మకాల పరిమాణం పెంచుకునే గొప్ప అవకాశం లభిస్తుందని, ఇది పరిశ్రమలకు, వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనకరమని అన్నారు. “జీఎస్టీ తగ్గింపు ద్వారా ఆదా అయ్యే ప్రతి రూపాయిని వినియోగదారులకే చేరవేయాలి. కొన్ని కేటగిరీలలో జీఎస్టీ 5 శాతానికి తగ్గడం వల్ల ప్రజలకు గణనీయమైన ఆదా లభిస్తుంది. ధరలు తగ్గితే సహజంగానే కొనుగోళ్లు పెరిగి పరిశ్రమల వృద్ధి వేగవంతమవుతుంది” అని గోయల్ వివరించారు.

 

ఈ జీఎస్టీ తగ్గింపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ‘పండగ కానుక’గా ఆయన అభివర్ణించారు. ఆగస్టు 15న ప్రధాని చెప్పినట్టుగానే జీఎస్టీలో కీలక మార్పులు వచ్చాయని, ఇంత భారీ స్థాయిలో వస్తువులు, సేవలకు ప్రయోజనం చేకూరుతుందని ఎవరూ ఊహించలేదని అన్నారు.

 

ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు ప్రధాని మోదీకి రెండు కీలక హామీలు ఇవ్వాలని గోయల్ కోరారు. మొదటిది, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు అందించడం. రెండవది, భారత్‌లో తయారైన ఉత్పత్తులను విస్తృతంగా ప్రోత్సహించడం. “మన దేశపు నేలలో, మన శ్రామికుల చెమటతో తయారైన ఉత్పత్తులకు మనం మద్దతు ఇవ్వాలి. అవి దేశంలోని ప్రతి మూలకు చేరినప్పుడు, కేవలం ఆర్థిక విలువే కాకుండా జాతీయ గర్వం, స్వావలంబన కూడా ఇనుమడిస్తాయి” అని ఆయన ఉద్ఘాటించారు.

 

ఉత్పత్తులను తయారుచేసే సంస్థ యజమాని భారతీయుడా లేక విదేశీయుడా అన్నది ముఖ్యం కాదని, అవి భారత్‌లోనే తయారై మన యువతకు ఉద్యోగాలు, స్థానిక సమాజానికి అవకాశాలు కల్పిస్తున్నాయా లేదా అన్నదే ముఖ్యమని గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి మధ్య కూడా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల నుంచి 30 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.

ANN TOP 10