భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 6న జరిగే ఈ మహా నిమజ్జన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని వీహెచ్‌పీ తెలంగాణ విభాగం ప్రకటించింది. ఈ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 1.10 గంటలకి ప్రత్యేక విమానంలో అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుని భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు భాగ్యనగర్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణంపై ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను అమిత్ షా ప్రారంభిస్తారు. కమిటీ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగుతారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్ఎస్‌బీ 28వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌కి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. ఐటీసీ కాకతీయ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు మొజంజాహీ మార్కెట్ వినాయక చౌక్‌కు చేరుకుంటారు. అక్కడ గణనాథులకు స్వాగతం పలకడంతో పాటు గణేశ్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.