దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకొని వినియోగదారులకు అనేక బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తమ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అధిగమించిందని ప్రకటించిన జియో.. ఈ మైలురాయిని పురస్కరించుకుంటూ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
అపరిమిత డేటా – నెలపాటు ఉచితం
సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇది ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులందరికీ వర్తించనుంది.
వార్షికోత్సవ వీకెండ్ ఆఫర్
సెప్టెంబర్ 5 నుంచి 7వరకు (శుక్రవారం, శనివారం, ఆదివారం) ప్రత్యేక వీకెండ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు: ప్రస్తుత ప్లాన్‌కు సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటా ఉచితం.
4జీ యూజర్లకు: రూ.39తో ప్రత్యేక రీచార్జ్ చేసి రోజుకు గరిష్ఠంగా 3జీబీ 4జీ డేటా పొందవచ్చు.
జియో హోం సేవలు – ఉచితంగా
రిలయన్స్ జియో మరో కీలక ప్రకటనగా, తమ జియో హోం సేవలను రెండు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. దీనివల్ల వినియోగదారులు ఇంటి నుంచే హై-స్పీడ్ కనెక్టివిటీని అనుభవించవచ్చు.
349 ప్లాన్‌ను 12 నెలలు తీసుకుంటే అదనంగా నెల ఉచితం
రూ.349 ప్లాన్‌ను వరుసగా 12 నెలలు రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనంగా ఒక నెల ఉచిత సేవలు కూడా అందించనున్నట్లు జియో వెల్లడించింది.
ఈ సందర్భంగా జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..“జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులు మాపై ఉంచిన విశ్వాసం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో జియో భాగమైందనే విషయంలో ఈ మైలురాయి ప్రతిబింబిస్తుంది. ప్రతి యూజర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా,” అని పేర్కొన్నారు.