AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పై ఈసీ కసరత్తు..! త్వరలో నోటిఫికేషన్..?

ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం సమీపిస్తుండటంతో ఎన్నికల సన్నాహకాలు వెంటనే మొదలుపెట్టాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి బుధవారం లేఖతో పాటు ఎన్నికల సన్నాహక షెడ్యూల్‌ను కూడా పంపారు.

 

2021లో ఎన్నికలు జరిగిన 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17వ తేదీతో ముగియనుందని తన లేఖలో నీలం సాహ్నీ స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం, పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీల విలీనం, అప్‌గ్రేడేషన్ వంటి పనులపై దృష్టి సారించి ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ఆదేశించారు.

 

ఎన్నికల సన్నాహకాలకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం, వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్), రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అక్టోబరు 15 నాటికి పూర్తి చేయాలని సూచించారు. నవంబరు 15 లోపు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని, నవంబరు 30 నాటికి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని ఆదేశించారు. డిసెంబరు 15 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను ముగించి, డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని తెలిపారు. మొత్తం మీద, 2026 జనవరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు.

 

వీటితో పాటు 2021 నవంబర్‌లో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు మరో 12 స్థానిక సంస్థల పదవీకాలం కూడా వచ్చే ఏడాది నవంబర్‌తో ముగియనుంది. మరోవైపు, న్యాయపరమైన చిక్కుల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి వంటి పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉందని లేఖలో ప్రస్తావించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేయనున్నట్లు నీలం సాహ్నీ వెల్లడించారు.

ANN TOP 10