వైసీపీ ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలన్న ఉద్దేశంతో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు ముగియగా, న్యాయాధికారి భాస్కరరావు తీర్పును ఈ నెల 6కు వాయిదా వేశారు.
పోస్టల్ బ్యాలట్‌తో ఓటు వేయవచ్చు: ప్రాసిక్యూషన్ వాదన
ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదిస్తూ, “ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అమృతపాల్ సింగ్ కేసులో పోస్టల్ బ్యాలట్ వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇదే విధానాన్ని మిథున్‌రెడ్డికి కూడా వర్తింపజేయాలి” అని పేర్కొన్నారు.
‘‘కేసుపై ప్రభావం ఉండదు’’ – మిథున్‌రెడ్డి తరఫు వాదనలు
మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, “బెయిల్ ఇవ్వడం వల్ల కేసుపై ప్రభావం పడే అవకాశం లేదు. ఓటు వేయడమే లక్ష్యంగా ఈ పిటిషన్ దాఖలైంది” అని న్యాయస్థానానికి తెలిపారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదివరకే పలుమార్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికను పురస్కరించుకుని మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.