దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో ప్రధానంగా 5 శాతం, 18 శాతం అనే రెండు శ్లాబుల విధానాన్ని ఆమోదించింది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పుల ఫలితంగా పాలు, పప్పుల నుంచి దుస్తులు, చెప్పుల వరకు అనేక నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
ఏయే వస్తువులు చౌక కానున్నాయి?
ప్రస్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులలో ఉన్న అనేక వస్తువులను కొత్తగా ప్రతిపాదించిన 5 లేదా 18 శాతం శ్లాబుల్లోకి మార్చడంతో వినియోగదారులపై భారం తగ్గనుంది. ఈ నిర్ణయంతో ప్రజలు రోజూ వినియోగించే కిరాణా సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, దుస్తులు వంటి ఎన్నో వస్తువులు చౌకగా లభించనున్నాయి.
ఆహార పదార్థాలు, నిత్యావసరాలు: పాల ఉత్పత్తులైన ప్యాకెట్ పాలు (యూహెచ్‌టీ) ఇకపై పన్ను రహితం కానున్నాయి. ప్రస్తుతం వీటిపై 5 శాతం పన్ను ఉంది. కండెన్స్డ్ మిల్క్, వెన్న, నెయ్యి, పనీర్, చీజ్ వంటివి 12 శాతం నుంచి 5 శాతం శ్లాబులోకి రానున్నాయి. పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు), శుద్ధి చేసిన చక్కెర, మిఠాయిలు, కూరగాయల నూనెలు, నమ్కీన్, భుజియా వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పన్ను 12-18 శాతం నుంచి కేవలం 5 శాతానికి తగ్గనుంది. మినరల్ వాటర్, ఏరేటెడ్ వాటర్ (చక్కెర లేనివి) కూడా 18 శాతం నుంచి 5 శాతానికి మారనున్నాయి.
వ్యవసాయం, ఎరువులు: రైతాంగానికి ఊరటనిస్తూ ఎరువులపై జీఎస్టీని 12/18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. విత్తనాలు, పంట పోషకాలు వంటి ఇతర వ్యవసాయ ఉత్పాదకాలపై కూడా పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి హేతుబద్ధీకరించారు.
ఆరోగ్యం, వినియోగ వస్తువులు: ప్రాణాలను రక్షించే మందులు, కొన్ని వైద్య పరికరాలపై పన్నును 12/18 శాతం నుంచి 5 శాతానికి లేదా కొన్నింటిపై పూర్తిగా సున్నాకు తగ్గించారు. సామాన్యులు వాడే చెప్పులు, దుస్తులపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. టెలివిజన్ లాంటి కొన్ని రకాల ఎలక్ట్రికల్ ఉపకరణాలపై కూడా పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.
ప్రియం కానున్నవి.. పన్ను భారం తగ్గనివి ఇవే!
సామాన్యులకు ఊరట కల్పిస్తూనే, విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ కఠినంగా వ్యవహరించింది. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న అధిక జీఎస్టీ రేట్లు, పరిహార సెస్సులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ ఉత్పత్తుల విలువను ఇకపై లావాదేవీల విలువకు బదులుగా రిటైల్ అమ్మకం ధర (ఆర్ఎస్పీ) ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల పన్ను ఎగవేతకు అడ్డుకట్ట పడుతుంది.
ముఖ్యంగా, చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు కలిపిన అన్ని రకాల శీతల పానీయాలపై పన్నును భారీగా పెంచారు. ప్రస్తుతం 28 శాతంగా ఉన్న పన్నును ఏకంగా 40 శాతానికి పెంచుతూ కొత్త శ్లాబును ప్రవేశపెట్టారు. విలాసవంతమైన వస్తువులైన ఖరీదైన కార్లు, ప్రీమియం మద్యం వంటివి కూడా ఈ 40 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ నిర్ణయాలతో సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూనే, హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని నిరుత్సాహపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.