భారత్‌లో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలో అతిపెద్ద మార్పును తీసుకువచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం భారతదేశ పురోగతిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… “భారత్‌లో తయారైన చిన్న చిప్ ప్రపంచ గతిని మార్చేస్తుంది. మనం ఈ రంగంలోకి ఆలస్యంగా వచ్చినా, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు” అని అన్నారు. 20వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను పెట్రోలియం నడిపిస్తే, 21వ శతాబ్దపు భవిష్యత్తును సెమీకండక్టర్లే నిర్దేశిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. “ఒకప్పుడు చమురు బావుల నుంచి ఎంత పెట్రోల్ తీశారన్న దానిపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉండేది. కానీ నేడు, ప్రపంచ అసలైన శక్తి ఒక చిన్న చిప్‌లో ఇమిడి ఉంది. పరిమాణంలో ఇది చిన్నదే అయినా, ప్రపంచ ప్రగతిని వేగవంతం చేసే సత్తా దీనికుంది” అని మోదీ అన్నారు.
ఈ కార్యక్రమానికి 40 నుంచి 50 దేశాల ప్రతినిధులు హాజరుకావడమే భారతదేశ యువశక్తి, ఆవిష్కరణలపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. “ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. మనతో కలిసి సెమీకండక్టర్ భవిష్యత్తును నిర్మించేందుకు సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లుగా ఉందని, రాబోయే కొన్నేళ్లలో ఇది 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేశారని మోదీ గుర్తుచేశారు. ఈ వృద్ధి కారణంగానే పెట్టుబడిదారులు భారత్ వైపు చూస్తున్నారన్నారు. కేవలం బ్యాక్-ఎండ్ పనులకే పరిమితం కాకుండా, డిజైన్ నుంచి తయారీ వరకు పూర్తిస్థాయి సామర్థ్యంతో భారత్ ఎదుగుతోందని తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో రూపొందించబడ్డాయని, ఇప్పటికే రెండో దశ సెమీకండక్టర్ మిషన్‌పై దృష్టి సారించామని వెల్లడించారు. “భవిష్యత్తులో మన గుర్తింపు ‘డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా’నే అవుతుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.