ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో సరికొత్త శకం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పూర్తి సౌరశక్తితో పనిచేసే ‘సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్’ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక వంటశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా సీకే దిన్నెతో పాటు కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, కడపలో ఒకటి… మొత్తం ఐదు స్మార్ట్ కిచెన్లను మంత్రి లోకేశ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కింద ఈ ఐదు వంటశాలల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 వాహనాల ద్వారా ఆహారాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారు. ఈ వాహనాలను, వంట కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్వో ప్లాంట్‌ను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, ఆర్వో నీటిని మాత్రమే ఉపయోగిస్తూ ఇక్కడ వంట చేస్తారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచి, శుచితో కూడిన భోజనాన్ని నిర్దేశిత సమయానికి అందిస్తామని సిబ్బంది మంత్రికి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం: మంత్రి లోకేశ్
ఈ కార్యక్రమం పనితీరును సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే ఆలోచన ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. “సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ ఒక పైలట్ ప్రాజెక్ట్. దీని పనితీరును నిశితంగా పరిశీలిస్తాం. తల్లిదండ్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అవసరమైన మార్పులు చేసి మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి, 1,24,689 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. అనంతరం స్మార్ట్ కిచెన్‌ను సందర్శించిన ఆయన, వంటకు ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతను, తయారీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థులతో ముఖాముఖి… ఈసారి నాకూ పరీక్షే!
అనంతరం మంత్రి లోకేశ్ పదో తరగతి క్లాస్ రూంను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. గత ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో తెచ్చిన సంస్కరణలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడం వల్ల పుస్తకాల మోత బరువు తగ్గిందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. సన్నబియ్యంతో భోజనం పెట్టడం వల్ల అన్నం చాలా రుచిగా ఉంటోందని క్లాస్ లీడర్ జాస్మిన్ చెప్పింది. ఈ సందర్భంగా పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్, కొత్త బెంచీలు కావాలని, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచాలని విద్యార్థులు కోరగా, త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కొత్తగా ఇచ్చిన యూనిఫాంలు, బ్యాగుల నాణ్యత బాగుందని, అయితే బ్యాగుల సైజు కొంచెం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తాను గీసిన లోకేశ్ ముఖచిత్రాన్ని ఆయనకు బహూకరించింది.
విద్యార్థులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ, “డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తవుతుంది. మీరంతా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి. ఈసారి పరీక్ష మీకు మాత్రమే కాదు, నాకు కూడా. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం” అని అన్నారు. తరగతి గదులను పరిశీలిస్తున్న సమయంలో గంగిరెడ్డి గణేశ్ రెడ్డి అనే విద్యార్థి నోట్‌బుక్‌లోని చేతిరాతను చూసి ముగ్ధుడైన లోకేశ్, ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణితో సమావేశమైన మంత్రి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సూచనలు కోరారు. ఉపాధ్యాయులపై పీటీఎం మినహా మరే ఇతర అదనపు భారాన్ని మోపడం లేదని, విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుని నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. అక్కడికక్కడే పాఠశాలలో ఆర్వో తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి సబిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఎమ్మెల్యేలు చైతన్య రెడ్డి, మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.