ఉక్రెయిన్ సంక్షోభానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ దేశాన్ని నాటో కూటమిలోకి లాక్కోవాలని చేసిన ప్రయత్నాలే ప్రస్తుత యుద్ధానికి దారితీశాయని ఆయన స్పష్టం చేశారు. చైనాలోని తింజియన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన పుతిన్, ఈ సంక్షోభంపై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. శాంతి స్థాపన కోసం చైనా, భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, “ఇది ఆక్రమణతో పుట్టుకొచ్చిన సంక్షోభం కాదు. పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్‌లో జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ యుద్ధం” అని పేర్కొన్నారు. ఒక దేశ భద్రత కోసం మరో దేశాన్ని బలిచేయకూడదన్న సూత్రాన్ని తాము నమ్ముతామని ఆయన అన్నారు. యుద్ధం మూలాల్లోకి వెళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని, భద్రతా సమతుల్యతను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. రష్యా అనుకూల అధ్యక్షుడిగా ఉన్న విక్టర్ యాంకోవిచ్‌ను మైదాన్ తిరుగుబాటుతో గద్దె దింపడం వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని ఆయన పరోక్షంగా ఆరోపించారు.
ఇటీవల అమెరికాలోని అలాస్కాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన తన భేటీ వివరాలను కూడా పుతిన్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోని ముఖ్యాంశాలను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు ఇతర ప్రపంచ నేతలతో పంచుకున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో తనకు కుదిరిన అవగాహన ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని, ఆలింగనం చేసుకున్నారు. ఈ చిత్రాలను ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. “పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది” అని మోదీ పోస్ట్ చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ శిఖరాగ్ర సదస్సును లాంఛనంగా ప్రారంభించారు.