AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మిస్టర్ రాహుల్ గాంధీ… మీ కరెన్సీ మేనేజర్ ఏం చేస్తున్నారో మీకు తెలుసా..?: కేటీఆర్ సంచలన ట్వీట్..!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలనే ఆయనకు గుర్తుచేస్తూ విమర్శలు గుప్పించారు.

 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. “మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ కరెన్సీ మేనేజర్ (సీఎం) కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గతంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, అవి ప్రతిపక్షాలను నాశనం చేసే సెల్‌గా మారిపోయాయని రాహుల్ విమర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆనాటి రాహుల్ ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను కూడా తన పోస్టుకు జతచేశారు.

 

ఒకప్పుడు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించిన దర్యాప్తు సంస్థలకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను ఎలా అప్పగిస్తుందని కేటీఆర్ పరోక్షంగా నిలదీశారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. “మేం రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతాం. మాకు న్యాయవ్యవస్థపైనా, ప్రజలపైనా పూర్తి నమ్మకం ఉంది. సత్యమేవ జయతే” అంటూ తన ట్వీట్‌ను ముగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ANN TOP 10