భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వెలువడగా.. భారత్ తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చైనాలో పర్యటించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భారత పర్యటన విషయంలో వెనుకడుగు వేసినట్లు పేర్కొంది. భారత్, అమెరికాల మధ్య ట్రేడ్ డీల్స్ కు సంబంధించి నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించేందుకు ట్రంప్ చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ట్రంప్ ఇటీవల పలుమార్లు మోదీకి ఫోన్ చేశారని, అయితేర మోదీ స్పందించలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
భారత్– పాక్ ల మధ్య యుద్ధం తానే ఆపానని ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించడంతో పాటు భారత్ పై అదనపు సుంకాలు విధించడంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికాకు దూరమవుతోందని, చైనాకు దగ్గరవుతోందని ఆరోపించింది. అమెరికా టారిఫ్ లను లెక్క చేయకుండా మోదీ చైనాలో పర్యటించడంతో ట్రంప్ కూడా భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.