భారత్, పొరుగు దేశమైన చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు, పరస్పర సున్నితత్వం అనే మూడు కీలక సూత్రాల ఆధారంగా వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో ఈ బంధాన్ని బలోపేతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రెండు రోజుల జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు తాను జపాన్ నుంచి నేరుగా చైనాలోని టియాంజిన్ నగరానికి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది కజన్‌లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలలో సానుకూల పురోగతి కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు.
“భూమిపై అతిపెద్ద దేశాలు, పొరుగున ఉన్న భారత్-చైనాల మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగితే, అది కేవలం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు కూడా ఎంతో మేలు చేస్తుంది,” అని ప్రధాని అభిప్రాయపడ్డారు. బహుళ ధ్రువ ఆసియా, బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటానికి ఇది చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతను ప్రస్తావిస్తూ, ఆర్థికంగా బలమైన దేశాలైన భారత్-చైనా కలిసి పనిచేయడం ఎంతో అవసరమని మోదీ నొక్కిచెప్పారు. ప్రపంచ ఆర్థిక క్రమానికి స్థిరత్వం తీసుకురావడంలో ఇరు దేశాల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రావడం, ఇప్పుడు ప్రధాని మోదీ చైనాకు వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.