AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరినా.. నిరాకరించారు: సుగాలి ప్రీతి తల్లి..

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు తమ కుమార్తె కేసు గురించి పదేపదే ప్రస్తావించిన పవన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను కలవడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ ఏడాది మే 1 నుంచి జులై 31 మధ్య కాలంలో కేసు విచారణ నిమిత్తం తాము 11 సార్లు హైకోర్టుకు వచ్చామని పార్వతి తెలిపారు. వచ్చిన ప్రతిసారీ పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినా ఆయన నిరాకరించారని వాపోయారు. “గతంలో ప్రతి నిమిషం సుగాలి ప్రీతి కేసు అనే ఆయన, ఇప్పుడు ఆ ప్రస్తావన తెస్తేనే తలనొప్పి వస్తోందని అంటున్నారు” అని ఆమె ఆరోపించారు.

 

అంతకుముందు కూడా సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తామని పవన్ కల్యాణ్ గతంలో హామీ ఇచ్చారని, దానిని ఇప్పుడు నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే ఆయన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

 

ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అంతకుముందు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో తాను చేసిన పోరాటాన్ని ఆమె మరచిపోవడం బాధాకరమని అన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన తనపైనే ఇలాంటి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. “పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి” అనే సామెత తన విషయంలో నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు.

 

గత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ సాహసించని రోజుల్లో తాను కర్నూలులో రెండు లక్షల మందితో భారీ సభ నిర్వహించి ఈ కేసును వెలుగులోకి తెచ్చానని పవన్ గుర్తుచేశారు. జనసేన చేసిన నిరంతర పోరాటం కారణంగానే సుగాలి ప్రీతి కేసు విచారణను సీబీఐకి అప్పగించారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ANN TOP 10