అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (రెసిప్రొకల్ టారిఫ్‌లు) విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ, ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టవిరుద్ధమని అక్కడి ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సుంకాల విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది.
వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసును విచారించి 7-4 మెజారిటీతో ఈ తీర్పును ఇచ్చింది. సుంకాలు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వాణిజ్య లోటును ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూపి, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ ఈ టారిఫ్‌లను విధించారు. అయితే, ఆ చట్టంలో టారిఫ్‌లు విధించే అధికారం ఎక్కడా స్పష్టంగా లేదని కోర్టు తేల్చి చెప్పింది.
ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. “ఈ తీర్పు ఇలాగే కొనసాగితే, అది అమెరికాను నాశనం చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్ కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ, సుప్రీంకోర్టులో తమకు అంతిమ విజయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే, ట్రంప్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే, భారత్‌పై విధించిన 25 శాతం ప్రతిస్పందన సుంకం రద్దవుతుంది. కాగా, జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియం, రాగి వంటి ఉత్పత్తులపై విధించిన సుంకాలకు ఈ తీర్పు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై విధించిన 25 శాతం సుంకం విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.