అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వీసాల కింద జరిగే నియామక ప్రక్రియల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా న్యాయ శాఖ తన నిఘాను తీవ్రతరం చేసింది. అమెరికన్ పౌరులను కాదని విదేశీ వీసాదారులకు ఉద్యోగాలిచ్చే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలపై దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి భారత సంతతికి చెందిన, న్యాయ శాఖలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న హర్మీత్ థిల్లాన్ నేతృత్వం వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఈ పదవికి స్వయంగా ఎంపిక చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, “ఇప్పటికే కొన్ని కంపెనీలపై చర్యలు తీసుకున్నాం. మరికొన్నింటిపై దర్యాప్తు జరుగుతోంది. అమెరికన్లకు అన్యాయం జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే మా హాట్‌లైన్‌కు సమాచారం ఇవ్వండి” అని ప్రజలను కోరారు.
మరోవైపు, హెచ్-1బీ వీసా విధానంపై ప్రభుత్వంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, “ప్రస్తుత హెచ్-1బీ వీసా విధానం ఒక పెద్ద స్కామ్. అమెరికన్లకు ఉద్యోగాలివ్వడానికే కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వాలి” అని వ్యాఖ్యానించారు. ఈ విధానాన్ని మార్చడంలో తాను పాలుపంచుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ సైతం ఈ ప్రోగ్రామ్‌ను ఒక కుటీర పరిశ్రమగా అభివర్ణించారు.
ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో “వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్” (అర్హతలకు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి) తీసుకురావాలని యోచిస్తోంది. ప్రతి సంవత్సరం జారీ చేసే 85,000 వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందడం గమనార్హం. తాజా మార్పులు అమల్లోకి వస్తే, భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదే క్రమంలో బుధవారం ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై కూడా కొత్త నిబంధనలను ప్రకటించింది. విద్యార్థి వీసాల గడువును గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. 2024లో 3,30,000 మంది విద్యార్థులతో అమెరికాకు అత్యధికంగా విద్యార్థులను పంపుతున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ నిర్ణయం కూడా భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుంది