AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ మద్దతు మాకు అవసరం లేదంటూ షాకిచ్చిన మంత్రి కిషన్ రెడ్డి..!

ఉప రాష్ట్రపతి ఎన్నిక బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడలను ముందే పసిగట్టిన బీజపీ కౌంటర్ ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు మాకు అవసర లేదని తేల్చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆయన మాటలపై బీఆర్ఎస్ షాకైంది.

 

ఉప రాష్ట్రపతి ఎన్నికల ఇష్యూతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ-బీఆర్ఎస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై గురువారం మీడియాతో మాట్లాడారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్‌కు అవసరమున్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడడం వారికి అలవాటన్నారు.

 

కేటీఆర్‌ను సపోర్టు ఎవరు అడిగారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అవసరమే లేదని తేల్చాశారు. కేంద్రం యూరియా ఇవ్వకుండా రాహుల్‌గాంధీ, రేవంత్‌‌రెడ్డి ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. యూరియాపై అంతర్జాతీయంగా కొంత సమస్య ఉందన్నారు.

 

బుధవారం మీడియా ముందుకొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపరాష్ట్రపతి ఎన్నికలపై నోరు విప్పారు. రాష్ట్రానికి లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ కానీ, రాహుల్‌గాంధీ గానీ ఎవరు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేస్తే ఆ పార్టీకి మా మద్దతు ఇస్తామన్నారు. పార్టీ తరపున నాలుగు ఓట్లు ఉన్నాయన్నారు.

 

యూరియా విషయంలో కేంద్రంతో కేటీఆర్ మాట్లాడాలి. అంతేగానీ విపక్షం కాంగ్రెస్ ఇస్తామని ప్రకటన చేస్తుందా? ఆ మాత్రం కేటీఆర్‌కు తెలీదా? అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ మాటలకు కౌంటరిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆరాటం పడితే .. అబద్దాలు ఆడితే అధికారం రాదన్నారు.

 

చచ్చిపోయిన పార్టీని బతికించాలని, పోయిన అధికారాన్ని సాధించాలని కొందరు విఫల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యూరియా విషయంలో కేంద్రంతో బీఆర్ఎస్ నేతలు పోరాటం చేయాలన్నారు. మీ పంపకాలు చూసే ప్రజలు దూరంగా పెట్టారన్నారని గుర్తు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏదో విధంగా అధికార కాంగ్రెస్, బీజేపీలపై ఎదురుదాడి చేయాలని భావించిన కేటీఆర్, దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన ఎత్తులు జాతీయ పార్టీల నేతల ముందు చిత్తు అవుతున్నాయి.

 

ఇక నేరారోపణ కింద జైలుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొందరు వ్యక్తుల వల్ల ప్రజల్లో వ్యవస్థలు చులకనగా మారిపోతున్నాయని చెప్పారు. అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేసినవారు ఉన్నారని, అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరు నెలలు జైల్లో ఉండి అక్కడే రివ్యూ మీటింగులు నిర్వహించారని గుర్తు చేశారు సదరు మంత్రి.

ANN TOP 10