కరీంనగర్ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వెంటనే ఇంటికి చేరుకున్నారు. తన అత్త చిట్ల విజయమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు జైలు నుంచి విడుదల అయిన తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తన అత్తను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
మా అత్తమ్మ చనిపోతే పక్షి ముట్టలేదని, ఆమెకు తాను అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. మా అత్తమ్మ నన్ను కొడుకు లెక్క చూసుకుందని, ఆమె చనిపోతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నామీద ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూపలేదన్నారు. ‘ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పరు… నోటీసులివ్వరు. పోలీసుల తీరుతో పోలీసులు తలదించుకునే దుస్థితి. సెల్ ఫోన్‌తో మీకు ఏం అవసరం?’ అని పేర్కొన్నారు.