ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ప్రధాన సముద్ర వాణిజ్య ముఖద్వారంగా (మారిటైమ్ గేట్‌వే), లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏ.పీ. మోలర్-మాయర్స్క్ గ్రూప్‌లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ (ఏపీఎంటీ) సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (ఏపీఎంబీ) ఒక కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పోర్టులు, టెర్మినళ్ల అభివృద్ధి, ఆధునికీకరణ వేగవంతం కానుందని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా రాష్ట్రంలో రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ‘ఏపీఎం టెర్మినల్స్’ అంగీకరించిందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడంతో పాటు, ప్రపంచస్థాయి టెర్మినళ్లను నిర్మించనున్నట్టు వివరించారు. పారిశ్రామిక ప్రగతికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించడం ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. పోర్టుల ప్రణాళిక, టెర్మినల్ కార్యకలాపాల్లో ఏపీఎం టెర్మినల్స్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం, రాష్ట్రానికి ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ సముద్ర వాణిజ్య రంగంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశ తూర్పు తీరానికి ‘మారిటైమ్ గేట్‌వే’గా, ‘లాజిస్టిక్స్ హబ్’గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆ దిశగా వేసిన ఒక బలమైన అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.