AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గబోతున్నాయా..? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..!

దేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటు ధరల్లో ఇంధనాన్ని అందించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని ఆయన గురువారం పార్లమెంటుకు తెలిపారు.

 

లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ఆ భారం వినియోగదారులపై పడకుండా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. ఇందులో భాగంగా 2021 నవంబర్, 2022 మే నెలల్లో రెండు విడతలుగా పెట్రోల్‌పై లీటరుకు రూ.13, డీజిల్‌పై రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు గుర్తుచేశారు. దీనికి తోడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు మరింత ఊరటనిచ్చాయని తెలిపారు.

 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) కూడా 2024 మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2022 జూన్‌లో బ్యారెల్‌కు 116 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరినా, దేశంలో ధరలను నియంత్రించగలిగామని మంత్రి తెలిపారు. 2021 నవంబర్‌లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.110.04 ఉండగా, ఇప్పుడు అది రూ.94.77కు, డీజిల్ ధర రూ.98.42 నుంచి రూ.87.67కు తగ్గిందని అన్నారు. 2025 ఏప్రిల్‌లో ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచినప్పటికీ, ఆ భారాన్ని చమురు సంస్థలే భరించాయని, వినియోగదారులపై మోపలేదని ఆయన స్పష్టం చేశారు.

 

ఇంధన భద్రత కోసం ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతోందని హర్దీప్ పురి అన్నారు. దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం ద్వారా 2014-15 నుంచి ఈ ఏడాది జులై వరకు రైతులకు రూ.1,25,000 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని, దీనివల్ల రూ.1,44,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని వివరించారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ఐదు నెలల ముందే (జూన్ 2022లో) సాధించామని, 2025 జులై నాటికి ఈ మిశ్రమం 19.93 శాతానికి చేరిందని ఆయన వెల్లడించారు.

ANN TOP 10