“చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్‌లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వాడిని గెలిపించుకుందాం” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు తర్వాత తెలుగు వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు, రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, మజ్లిస్ సహా అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆనాడు ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారని తెలిపారు. తెలుగు వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో ఎన్టీఆర్ సహకరించారని తెలిపారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారని, న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలు అందించారని తెలిపారు.