AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

గత పది నెలలుగా భారత్-చైనా సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరస్పర ప్రయోజనాలను, సున్నితత్వాలను గౌరవించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి చర్చల కోసం ఢిల్లీకి చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను పంచుకుంటూ ప్రధాని మోదీ తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలవడం సంతోషంగా ఉంది. గత ఏడాది కజాన్‌లో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి, ఇరు దేశాల ప్రయోజనాలు, సున్నితత్వాలను గౌరవించుకోవడం ద్వారా భారత్-చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పంపిన ఆహ్వానాన్ని ప్రధాని మోదీ అంగీకరించారు. టియాంజిన్‌లో జరగనున్న ఈ సదస్సులో మరోసారి జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నట్లు తెలిపారు.

“ఎస్సీఓ సదస్సు సందర్భంగా టియాంజిన్‌లో మరోసారి సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-చైనా మధ్య స్థిరమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు ఎంతగానో దోహదం చేస్తాయి” అని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ANN TOP 10