భారత చలనచిత్ర నిర్మాణానికి హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అవార్డులకు ఎంపికైన పలువురు తెలుగు సినీ ప్రముఖులు సోమవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అవార్డు విజేతలందరినీ అభినందించి, శాలువాలతో సత్కరించారు. అనంతరం సినీ ప్రముఖులతో కాసేపు ముచ్చటించారు. ఈ భేటీలో సినీ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను, సమస్యలను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వారి సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ‘భగవంత్ కేసరి’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ, ‘బేబి’ దర్శకుడు సాయి రాజేశ్, గాయకుడు రోహిత్ ఉన్నారు. వీరితో పాటు ‘హనుమాన్’ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేసిన వెంకట్, శ్రీనివాస్ బృందంతో పాటు ఫైట్ మాస్టర్లు నందు, పృథ్వీలను కూడా ముఖ్యమంత్రి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, ‘బేబి’ నిర్మాత ఎస్‌కేఎన్, ‘భగవంత్ కేసరి’ నిర్మాత సాహు గారపాటి తదితరులు పాల్గొన్నారు.