విలక్షణ నటుడు, దివంగత కోట శ్రీనివాసరావు కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కన్నుమూసి నెల రోజులు కూడా గడవక ముందే, ఆయన అర్ధాంగి రుక్మిణి (75) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నెల రోజుల క్రితం, జూలై 13న కోట శ్రీనివాసరావు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన రుక్మిణి, కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆమె ఆరోగ్యం విషమించి కన్నుమూశారు.
నెల రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో కోట కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలియగానే తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు కోట కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాప సందేశాలను తెలియజేస్తున్నారు. రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.