AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవరో నచ్చలేదని ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మూర్ఖత్వమే: రేవంత్ రెడ్డి..

తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడకుండా, వ్యక్తిగత కారణాలతో ఎవరో నచ్చలేదని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ జెన్కో ఆడిటోరియంలో వాక్కులమ్మ ప్రచురణ సంస్థ ద్వారా వెలువడిన “హసిత బాష్పాలు” (కావ్య రూపం) పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సుల వల్లే ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశం తనకు లభించిందని ఆయన అన్నారు.

 

తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను, నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎవరిపైనా వ్యక్తిగత కక్షతో అధికారాన్ని దుర్వినియోగం చేయబోనని, ఎవరినీ శత్రువుగా చూడనని ఆయన తేల్చి చెప్పారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని అన్నారు.

 

2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎటువంటి మంత్రి పదవి చేపట్టకుండానే నేరుగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానంటే, భగవంతుడు తనపై ఏదో గురుతర బాధ్యతను ఉంచాడని విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగా, అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పేదవాడు ఆత్మగౌరవంతో జీవించడమని ఆయన ఉద్ఘాటించారు.

 

ఉద్యమం సమయంలో ఎంతోమంది సర్వం కోల్పోయారని రేవంత్ రెడ్డి అన్నారు. నిజమైన ఉద్యమకారుడు ఎప్పుడూ తాను ఉద్యమకారుడినని చెప్పుకోడని ఆయన అన్నారు. అందెశ్రీ, గద్దర్ లాంటి వారు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు స్ఫూర్తినివ్వాలనే సంకల్పంతో పనిచేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.

ANN TOP 10