వైసీపీ అధినేత జగన్ కు, సీఎం చంద్రబాబుకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో కుప్పంలో జగన్ చేసిన దాన్నే, ఇప్పుడు పులివెందులలో చంద్రబాబు చేశారని ఆమె ఆరోపించారు. ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, “గతంలో కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని జగన్ కాలరాస్తే, ఇప్పుడు పులివెందులలో చంద్రబాబు అదే పని చేస్తున్నారు. ఎన్నికల విషయంలో ఇద్దరూ తాలిబన్ల వలే వ్యవహరిస్తున్నారు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెప్పు పొందడం కోసమే పనిచేస్తున్నారని ఆమె విమర్శించారు.
దేశంలో ఓట్ల చోరీతో మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే, రాష్ట్రంలోని ఈ ఇద్దరు నేతలు కనీసం నోరు మెదపడం లేదని షర్మిల విమర్శించారు. “ఎందుకంటే బీజేపీతో ఒకరిది బహిరంగ పొత్తు అయితే, మరొకరిది అక్రమ పొత్తు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీకి ఊడిగం చేస్తున్నారు” అని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్య విలువలు నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని షర్మిల స్పష్టం చేశారు.