రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం మరోసారి రాజుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం జరగదని… ఈ ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రతిస్పందించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణకు ఉన్న హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి నీటి చుక్క కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించారని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే ఈరోజు తెలంగాణ సాగునీటి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి, పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటామని, అయితే హక్కుల విషయానికి వస్తే మాత్రం వెనక్కి తగ్గేది లేదని గట్టిగా హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆయన భరోసా ఇచ్చారు. నెహ్రూ నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లతోనే మనకు నీళ్లు అందుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అని… ఈ బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళతామని అన్నారు. ప్రపంచ సుందరీమణుల పోటీలను హైదరాబాద్ లో నిర్వహించామని… ఈ సందర్భంగా పోటీలకు వచ్చిన వారికి తెలంగాణ ప్రత్యేకతలు చూపించామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. ఇక్కడి ఫార్మా కంపెనీలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.