అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అక్కడి ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఆర్థిక నిరక్షరాస్యుడని, ఇతర దేశాల ప్రయోజనాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని ఆయన దుయ్యబట్టారు. ట్రంప్ ను నమ్మొద్దని భారత్ కు హితవు పలికారు. అమెరికాతో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
భారత్ పై ట్రంప్ టారిఫ్ లు విధిస్తున్న సమయంలో జెఫ్రీ సాచ్స్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందనే నెపంతో భారతదేశంపై ట్రంప్ 50 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ – అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది.
అమెరికాతో అప్రమత్తంగా ఉండాలని భారత్ కు సందేశం పంపించిందని జెఫ్రీ పేర్కొన్నారు. అమెరికా మార్కెట్ ను వదిలిపెట్టి విశ్వసనీయమైన మిత్రులు రష్యా, ఆఫ్రికా, చైనా తదితర ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని జెఫ్రీ సాచ్స్ సూచించారు.