స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ రక్షణ రంగంలో ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు 2035 నాటికి ‘సుదర్శన చక్ర’ పేరుతో ఒక అత్యాధునిక ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు ఎర్రకోట వేదికగా వెల్లడించారు. ఈ శక్తిమంతమైన సాంకేతిక రక్షణ కవచం దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు పూర్తి భద్రత కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో ఈ మిషన్‌కు పేరు పెట్టినట్టు ప్రధాని తెలిపారు. ఇది భారత రక్షణ వ్యూహంలో ఒక సాహసోపేతమైన మార్పుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా, వచ్చే పదేళ్లలో దేశానికి ఒక పటిష్ఠమైన సుదర్శన చక్ర కవచాన్ని నిర్మించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. 2035 నాటికి ఈ జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించి, బలోపేతం చేసి, ఆధునికీకరిస్తాం. ఇందుకోసం దేశం ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రారంభిస్తుంది” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ మిషన్‌లో భాగంగా శత్రువుల దూకుడును అడ్డుకోవడమే కాకుండా, శక్తిమంతమైన ప్రతిదాడి చేసేందుకు వీలుగా కచ్చితమైన లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోనున్నట్టు ఆయన వివరించారు. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ ఈ జాతీయ భద్రతా కవచం కిందకు తీసుకువస్తామని తెలిపారు.
గత పదేళ్లలో అభివృద్ధి చేసిన టెక్నాలజీతో ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్ల దాడులను భారత్ సమర్థవంతంగా నిలువరించిందని ప్రధాని గుర్తుచేశారు. యుద్ధ రంగంలో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, భారత సైనిక శక్తిని నిరంతరం మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.