AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సామాన్యులకు “డబుల్ దీపావళి”..! ప్రధాని మోడీ కీలక ప్రకటన..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక తీపి కబురు అందించారు. ఈ ఏడాది ప్రజలకు “డబుల్ దీపావళి” కానుక ఇవ్వబోతున్నట్లు ప్రకటించి, సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా కీలక హామీ ఇచ్చారు. ముఖ్యంగా నిత్యం ఇంట్లో వాడే వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని భారీగా తగ్గించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 

శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, “ఈ దీపావళికి నేను మీకు డబుల్ దీపావళిని జరిపించబోతున్నాను. దేశ ప్రజలకు ఒక పెద్ద బహుమతి అందబోతోంది. సాధారణ గృహ వినియోగ వస్తువులపై జీఎస్టీలో భారీ కోత ఉంటుంది” అని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లను సమీక్షించడం తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త తరం జీఎస్టీ సంస్కరణలను సిద్ధం చేస్తోందని మోదీ వెల్లడించారు.

 

ఇదే సందర్భంగా పాలన, పన్నుల విధానం, ప్రభుత్వ సేవల వంటి కీలక రంగాల్లో నూతన తరం సంస్కరణలను వేగవంతం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. “మేము నెక్స్ట్-జనరేషన్ సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అన్ని రకాల సంస్కరణలను తీసుకురావడమే ఇప్పుడు మా లక్ష్యం” అని ఆయన తెలిపారు.

 

భారతదేశంలో జీఎస్టీ విధానం అమలులోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2017లో ప్రారంభమైన జీఎస్టీ, దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రతిపాదిత సంస్కరణలు పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసి, పారదర్శకతను పెంచుతాయని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ ‘డబుల్’ హామీతో, రాబోయే దీపావళి పండుగ నాటికి పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయోనని పౌరులు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ANN TOP 10